Pages

Wednesday, June 19, 2013

Story- కోడలి తలరాత దిద్దిన శిల్పం


Tried writing a story for the first time. My mom used to tell a similar story when we were kids. Since I don't remember some of it, I used my creativity and modified it. If you like it please leave a comment. Any suggestion is welcome too.( not only for this post but others too. That will motivate me to post more stuff.)  Thank you and enjoy the story.

కోడలి తలరాత దిద్దిన శిల్పం 

ఒక ఊరిలో కాంతమ్మ అనే ఆవిడ  ఉండేది. ఆమెకు నోటి దురుసు ఎక్కువ. ఆమెకు ఒక్కడే కోడుకు.  పేరు రమణయ్య. రమణయ్య చిన్న వయస్సులోనే   తండ్రి చనిపోయాడు. కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంది.రమణయ్య కి కూడా అమ్మ అంటే చాల ఇష్టం. ఆమె ఎంత అంటే అంత. అసలు ఎదురు చెప్పేవాడు కాదు. కొడుకుకి యుక్త వయసు రాగానే సుశీల అనే  అమ్మాయితో పెళ్లి చేసింది. పెళ్ళైతే   చేసింది కానీ ఎక్కడ కోడలు తన కొడుకుని కొంగున  ముడి వేసుకుంటుందో అని భయం పట్టుకుంది. అప్పుడు కోడుకు తన మాట వినడు.పెత్తనమంతా కోడలి చేతికి వెళ్ళిపోతుంది అని భయపడసాగింది. అందుకని కోడలిని ఎప్పుడు ఏదో ఒకటి అని సతాయిస్తూ ఉండేది.చేసిన ప్రతి పనిలోనూ పేరు పెట్టేది. సుశీలకి చాల బాధ వేసేది. భర్తతో చెప్తే  "మా అమ్మ నీ కన్నా వయసులో ఎంతో పెద్దది ఒక మాట అంటే పడలేవా" అనేవాడు. పోనీ పుట్టింట్లో వాళ్ళకి చెబ్దామంటే వాళ్ళు కూతురు కాపురం బాగాలేదేమో అని బాధపడతారు. అలాగే ఓపికగా భరించేది. కానీ దేనికయినా ఒక హద్దు ఉంటుంది కదా. తిట్లు విని విని సుశీల లో అసహనం పెరగసాగింది. కానీ తిరిగి  ఏమి అనలేదు. మొగుడు తనకు అనుకూలంగా మాట్లాడడు. అత్త ఇంట్లో నుంచి తరిమేస్తుంది.

ఒక రోజు సాయంకాలం నీళ్ళ కోసమని చెరువుకు బయల్దేరింది  సుశీల. ఆ చెరువు పక్కన ఒక పాడు బడ్డ గుడి ఉంది. సుశీలకి వెంటనే  ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. ఆ గుడి దగ్గర కూర్చుంది. వెంటనే  ఆ రోజు పొద్దున్న అత్త అన్న మాటలన్నీ గుర్తుకు వచ్చాయి. ఆమె కోపం కట్టలు తెంచుకుంది.ఎదురుగ ఒక్క శిల్పం కనిపించింది. దానినే అత్త గారు అనుకొని చెడ మడ తిట్టేసింది. పనిలో పని మొగుడిని కూడా తిట్టింది. కొంచం ఆవేశం చల్లారాక ఇంటికి వెళ్ళిపోయింది.

ఆ గుడిలో ఉన్న శిల్పానికి ఒక చరిత్ర ఉంది. అది ఒక గంధర్వ కన్య. ఆమె ఒక రోజు భూలోక విహారానికి  వచ్చి ఈ గుడిని చూసింది. అప్పట్లో ఈ గుడి ఎంతో అందంగా ఉండేది. ఆ గుడి సౌందర్యాన్ని చూస్తూ తన్మయత్వం తో పాట పాడింది .  ఆమెకి తెలియని విషయం ఏంటంటే ఆ గుడిలో ఒక మూల ఒక ముని ఇంకా అతని పత్ని తపస్సు చేసుకుంటున్నారు. ఈమె పాట వారి తపస్సుకి అంతరాయం కలిగించింది. వెంటనే  ఆ మునికి కోపం  వచ్చింది. "ఏ గుడిని చూసి నువ్వు మైమరచి పోయావో. ఆ గుడిని చూస్తూ నువ్వు ఇక్కడే శిల్పం లా  పడి ఉండు.నువ్వు ఈ గుడిని దాటి  వెళ్ళలేవు  " అని శాపం ఇచ్చి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ గంధర్వ కన్య ముని పత్ని కాళ్ళు పట్టుకొని "తల్లీ నువ్వే నాకు దిక్కు. మీ తపస్సు  భంగం చెయ్యడం నా ఉద్దేశం కాదు. తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్షా?" అని వేడుకుంది. ఆ ముని పత్ని జాలి తో "అమ్మా  నా భర్త ఇచ్చిన శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను. కానీ నా భర్త కోపానికి గురి అయ్యి నువ్వు శిల్పంగా మారితే ఇంకొక వ్యక్తి కోపం వల్ల  నీకు శాప విమోచనం  కలుగుతుంది. అంత వరకు నీకొక వరం ఇస్తాను. ను వ్వ్వు శిల్పంలా ఉన్న నీ చుట్టూ జరిగేవి నీకు తెలుస్తూ ఉంటాయి ,ఇంకా  ఎవరూ  లేని సమయం లో నువ్వు నీ అసలు రూపం లో ఈ గుడిలో తిరగగలవు." అని ఆమె వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ శిల్పం అక్కడ అలాగే ఉంది. ఆ రోజు కోడలు తిట్టిన తిట్లకు ఆశ్చర్య పోయి ముక్కున వేలు వేసుకుంది  ఆ శిల్పం. ఆమె మర్చిపోయి అలాగే ఉండి పోయింది.

ఆ గుడిలో మూల విగ్రహం ఇంకా అలాగే ఉంది . అక్కడి నుంచి కదిలిస్తే పాపం అని అక్కడే ఉంచారు. ఆ ఊరి పూజారి రోజూ  పొద్దున్న అక్కడ పూజలు చేసి వెళతాడు. ఆ రోజు కూడా అలాగే వచ్చాడు. పూజ ముగించుకొని వెళ్తూ ఆ శిల్పాన్ని చూసాడు. శిల్పం ముక్కున వేలేసుకొని ఉంది. అతను రోజూ  ఆ శిల్పాన్ని చూస్తాడు కనుక దాని భంగిమ ఏంటో అతనికి బాగా తెలుసు. శిల్పం తనంతట తను భంగిమ ఎలా మార్చిందో అతనికి అర్ధం కాలేదు. వెంటనే  ఊరి పెద్దలకి విషయం చెప్పాడు. ఆ వార్త ఊరంతా పాకి జనాలందరూ గుడి దగ్గరికి పరిగెత్తారు. సుశీల,రమణయ్య, కాంతమ్మ కూడా వెళ్లారు. ఊరి పెద్దలు మాట్లాడుకుంటున్నారు "నిన్నటి వరకు బాగా ఉన్న శిల్పం ఇలా ఎందుకు మారింది. దీని వల్ల  ఊరికి ఏదయినా చెడు జరుగుతుందేమో. ఎవరయితే శిల్పాన్ని మళ్లి  మామూలు స్థితికి తెస్తారో వారికి  ఘనంగా సన్మానం చేస్తాం." అని ప్రకటించారు. సుశీలకి ఎందుకో అనుమానం కలిగింది. తను చేస్తాను అనింది ."నీ వల్ల  ఏమవుతుంది నీ మొహం" అనింది అత్త. అయిన సరే ఊరి పెద్దలని ఒప్పించి గుడిలోకి వెళ్ళింది. గుడి దగ్గర ఎవరూ  ఉండకూడదని షరతు పెట్టింది. గుడిలోకి వెళ్లి ఆ శిల్పం ఎదుట నిల్చొని చేతులు జోడించి "తల్లీ  నేను బిందెలో నీళ్ళు నింపుకొని వచ్చినప్పుడు నువ్వు బాగానే ఉన్నావు. నేను చూసాను. తర్వాత నేను కోపం లో నా భర్తని అత్తని తిట్టి వెళ్ళిపోయాను. నువ్వు ఇలా మారిపోవడానికి నా తిట్లే కారణం అనిపిస్తోంది. దయ చేసి నువ్వు మామూలు స్థితికి రా.లేదంటే ఈ ఊరిలో వాళ్ళు పక్క ఊర్లనుంచి  స్వాములని పిలిపిస్తారు అప్పుడు నిజం అందరికి తెలుస్తుంది. మా అత్త  నన్ను చంపేస్తుంది." అని బ్రతిమాలింది. కానీ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకొని  ఆ శిల్పం అలాగే ఉండిపోయింది. సుశీల చాల సేపు అడుక్కుంది కానీ లాభం లేకపోయింది. ఇంక  కోపంతో శిల్పాన్ని తిట్టడం మొదలుపెట్టింది. దెబ్బకి శిల్పం ముక్కు మీద నుంచి వేలు తీసింది పైగా ఆమెకు తన మామూలు రూపం వచ్చింది."నీకు అంతా మంచే జరుగుతుంది" అని  సుశీలని ఆశీర్వదించి తనలాంటి శిల్పాన్ని ఒకటి అక్కడ పెట్టి ఆమె తన లోకానికి వెళ్ళిపోయింది. ఊరిలో వాళ్ళు సుశీలను సన్మానించారు. ఊరిలో అందరు చాలా  పొగిడారు. పొగుడుతూనే ఉన్నారు. కాంతమ్మకు  కోడల్ని అందరు అలా నెత్తిన ఎక్కించుకోవడం నచ్చలేదు.రమణయ్యకి కూడా.

కాంతమ్మ,రమణయ్య కలిసి ఒక ఉపాయం చేసారు. నిద్రపోతున్న సుశీలకు మత్తు మందు ఇచ్చి మూట కట్టి అడవిలోకి తీసుకెళ్ళారు. అక్కడ ఒక చోట పెట్టి కిరోసిన్ పోసారు. తీరా చూస్తే అగ్గి పెట్ట లేదు. నీది తప్పంటే నీది తప్పని కొంచం సేపు  వాదులాడుకున్నారు. తర్వాత నేను తెస్తానంటే నేను తెస్తాను అని ఇద్దరూ  మూట అక్కడ వదిలి వెళ్లారు. కొంచం సేపటికి సుశీల కి మెలుకువ వచ్చింది. కష్టం మీద బయటికి వచ్చింది. వెంటనే విషయం అర్ధం అయ్యింది. దగ్గరిలో ఉన్న ఆకులు అలములు ఆ మూటలో దూర్చి చెట్టు ఎక్కి కూర్చుంది. కొంచం సేపటికి కాంతమ్మ,రమణయ్య వచ్చి మూట అక్కడే ఉండటం చూసి సంతోషించి తగలబెట్టి వెళ్ళిపోయారు. సుశీల అరవటంలేదు అన్న ఆలోచన కూడా రాలేదు వాళ్ళకు. అత్త,భర్త చేసిన పని తలుచుకొని సుశీల చాల సేపు ఏడ్చింది. ఆ చీకటిలో వెళ్ళలేక అలాగే చెట్టు మీద పడుకుంది. కొంచం సేపయ్యాక ఏదో అలికిడికి మెలుకువ వచ్చింది. చూస్తే చెట్టుకింద కొందరు దొంగలు వాళ్ళు ఆ రోజు కొట్టుకొచ్చిన నగలు,డబ్బు పంచుకుంటున్నారు. అవి చూద్దామని సుశీల కొంచం ముందుకు వంగింది. పట్టు కుదరక జారి కింద పడింది. దెయ్యం అనుకొని దొంగలు చెరో దిక్కు పారిపోయారు.మళ్లి చెట్టు ఎక్కి వాళ్ళు వస్తారేమో అని చూసింది సుశీల. కానీ ఎవరు రాలేదు. తెల్లవారాక ఆ నగలు,డబ్బు మూట కట్టుకొని ఇంటికి వచ్చింది. చచ్చి పోయిన కోడలు తిరిగి వచ్చేసరికి  కాంతమ్మ కోడలికి ఏవో మహిమలు తెలుసని భయపడింది. ఆ రోజు నుంచి సుశీలని చాల జాగ్రత్తగా చూసుకుంది. రమణయ్య కూడా. సుశీల ఆ డబ్బు,నగలతో ఆ పాత గుడిని బాగుచేయించింది.  మిగిలిన డబ్బులతో దానాలు చేస్తూ ఎంతో పేరు తెచ్చుకుంది.







2 comments:

To leave a comment please touch the rectangle next to "comment as" and you can pick options like if you want to use your google id or wordpress login etc. to comment. You also have the option to just use your name and be anonymous to leave a comment.