Pages

Thursday, October 26, 2017

తరాలు - అంతరాలు

తరాలు - అంతరాలు
=================




Image source:Pixabay



చాలా ఏళ్ళ క్రిందట :

                       
    ఒక ఊరిలో సూర్యకాంతం, రమణ రావు అనే దంపతులు ఉండేవారు. వారు చాలా ధనవంతులు. ఇంటి నిండా నౌకర్లు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు రవీంద్ర. కూతురి పేరు సుశీల. ఇంట్లో అన్ని పనులు నౌకర్లు చేసినా ,  వంట పని మాత్రం సూర్యకాంతం చేసేది . భర్తకి , పిల్లలకి వండిపెట్టడం ఆమెకి చాలా ఇష్టం. సూర్యకాంతంకి  కొన్ని చాదస్తాలు, పట్టింపులూ  ఉన్నాయి. పని వాళ్ళని వంట ఇంట్లోకి రానిచ్చేది కాదు. తనకు వంటింట్లో సహాయానికి తన దూరపు బంధువు ఒక ఆవిడని పెట్టుకుంది. ఆవిడ పని కూరగాయలు తరగడం, సూర్యకాంతంకి కావలసినవి అందివ్వడం. వంటపని కాకుండా సూర్యకాంతంకి  ఇంట్లో వేరె పనులు కూడా ఉండేవి. అవి పని వాళ్ళకి పనులు అప్పచెప్పడం, వాళ్ళు ఆ పనులు సరిగ్గా చేసారో లేదో చూడడం,వారికి సమయానికి జీతాలు ఇవ్వడం ఇలా. కాలం గడిచింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసారు. కొడుకుకి పట్టణంలో ఉద్యోగం. పెళ్లి అయినా మరు రోజే తన పెళ్ళాం సురేఖ ని తీసుకొని వెళ్ళిపోయాడు. సురేఖ కూడా పట్టణంలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరు పని చెయ్యకపోతే పట్టణంలో కష్టం అన్నాడు రవీంద్ర. 

                       కొన్ని రోజులకి పిల్లల మీద బెంగ పెట్టుకుంది సూర్యకాంతం. ఒక సారి చూసి వద్దామని అంది భర్తతో. భార్య మాట ఎప్పుడూ కాదనని రమణారావు సరే అన్నాడు. మరుసటి రోజు కూతురి వద్దకు బయలుదేరారు. కూతురికి పెళ్లి చేసి పంపినప్పుడు ఆమె వెంట ఒక పని పిల్లను కూడా పంపారు. తల్లి,తండ్రిని చూడగానే సుశీల ఎంతో ఆనందపడింది. వంట వాళ్ళతో సకల వంటలు చేయించింది. అస్సలు సూర్యకాంతంని  ఒక్కసారి  కూడా వంట ఇంటి వైపు వెళ్ళనివ్వలేదు. కూతురు ఒక్క పని చెయ్యకుండా నౌకర్లు అన్ని పనులు చేసేస్తుంటే ఆమె రాజా యోగం చూసి వారు ఎంతో ఆనందించారు. అక్కడ కొన్ని రోజులు ఉండి  కొడుకు దగ్గరికి బయలుదేరారు.

                         కొడుకు ఉండేది ఒక పెద్ద పట్టణం. ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. మేము  సహాయం చేస్తాము ఇల్లు కొనుక్కో అంటే నేను నా డబ్బుతోనే కొంటాను అన్నాడు. ఆ ఇంట్లో ఒకే ఒక పని మనిషి . తనే ఇంటి  పని ,వంట పని చేస్తోంది. అది సూర్యకాంతంకి నచ్చలేదు. ఆ పిల్ల వంటఇంట్లోకి  వెళ్లడం తనకు ఇష్టం లేదని చెప్పింది. సురేఖ ఉద్యోగంకి వెళ్ళాలి కనుక ఆ పిల్ల సహాయం చెయ్యకపోతే కష్టం అనింది. తను ఉన్నన్ని రోజులు తానే వంట చేస్తాను అనింది సూర్యకాంతం. మరుసటి రోజు వంట ఇంట్లోకి వెళ్ళింది సూర్యకాంతం. అక్కడ కట్టెలపొయ్యికి బదులు గ్యాస్ పొయ్యి ఉంది. రుబ్బు రోలు బదులు మిక్సీ ఉంది. కత్తిపీట బదులు ఒక చెక్క,కత్తి ఉన్నాయి. ఆమెకి  అలవాటు లేదు.  కోడలిని సహాయం అడిగింది. ఆమె ఆఫీసుకి వెళ్లే హడావుడి లో ఉంది. అత్తగారి మీద కోపం ముంచుకొచ్చింది. అది దిగమింగుకొని గబగబా వంట చేసింది. సాయంకాలం వచ్చాక వచ్చాక అవి ఎలా ఉపయోగించాలో చెప్పింది. ఆమెకి ఇంకా గందరగోళంగానే ఉంది. రోజు ఎదో చెయ్యాలని వంట ఇంట్లోకి వెళ్లడం,అర్ధం అవ్వక కోడలిని పిలవడం తను వచ్చి అన్ని పనులు చేసేది. అంత వరకు పని మనిషి అన్ని చేస్తుంటే సుఖంగా ఉండేది ఇప్పుడు  సురేఖకు పని ఎక్కువ అయ్యి చిరాకు వచ్చేస్తోంది. మొగుడికి చెప్పింది. " ఇంటి పనంతా పని మనిషి చేస్తోంది కదా, వంట ఒక్కటి చెయ్యడానికి ఎందుకంత బాధ " అన్నాడు. ఆమెకి కోపం ముంచుకొచ్చింది. కొద్దీ సేపు గొడవ పడ్డారు. మరుసటి రోజు మళ్ళి  మామూలే. 

                      ఆ రోజు శనివారం. మరుసటి రోజు సెలవు కాబట్టి  వడలు చేద్దాము అనింది సూర్యకాంతం సురేఖతో.రవీంద్రకు వడలు చాలా ఇష్టం.  రోజు లాగ హడావిడి లేదు కదా ఆలస్యంగా లేచి చెయ్యొచ్చులే అనుకుంది సురేఖ. కానీ తెల్లవారుజామునే సూర్యకాంతం వచ్చి లేపింది. ఇప్పటినుంచి పిండి రుబ్బుతే కానీ సమయానికి టిఫిన్ పెట్టలేము అనింది. ఆదివారం కూడా సరిగ్గా నిద్రపోనివ్వని అత్తగారి మీద చిర్రెత్తుకొచ్చింది. మిక్సీ లో వేస్తే గంటలో అయిపోతుంది పోయి పడుకోండి అని విసుక్కోని వెళ్ళిపోయింది. కోడలి ప్రవర్తన అస్సలు నచ్చలేదు సూర్యకాంతంకి . నిద్ర లేవగానే సురేఖతో అనింది "ఏంటమ్మాయి నేను వచ్చినప్పటినుంచి చూస్తున్న మొగుడికి ,అత్త మామలకి వండిపెట్టడానికి అంత బద్ధకం,విసుగు  అయితే ఎలా? ఇక్కడ  ఇన్ని పరికరాలున్నాయి.  వాటివల్ల సగం పని తగ్గిపోతోంది. అయినా కూడా కష్టం అంటున్నావు. మా ఊరిలో ఇలాంటివి ఏమి లేవు అయినా నేను ఒక్క రోజు కూడా  విసుక్కోకుండా ఎంత మందికి ఎన్ని వండిపెట్టలేదు." అంతే ఇంక  సురేఖ ఆపుకోలేక పోయింది "ఏంటండీ మీరు ఆలా మాట్లాడుతున్నారు. మీకు వంటిల్లు తప్ప వేరే లోకం తెలియదు. కానీ నా పరిస్థితి అది కాదు కదా . రోజుకి 8 గంటలు ఆఫీసులో పని చేసి వస్తాను. అక్కడ ఎన్ని తలనొప్పులొ మీకు తెలుసా. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చాక కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తుంది. కానీ మీరు వచ్చాక అది అస్సలు కుదరట్లేదు. ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే వంటింట్లో దూరాలి . ఆ పనిపిల్ల వంట చేస్తుంటే తక్కువ కులం అని చేయనివ్వరు. మీరు  చెయ్యలేరు. నేను ఎదో తిప్పలు పది చేస్తుంటే పేర్లు పెడుతున్నారు. మీకేంటి అక్కడ వంటింట్లో సహాయం చెయ్యడానికి వంటింట్లో మనుషులు ఉన్నారు. ఎన్ని వంటలయిన చేస్తారు" అనేసి వెళ్ళిపోయింది. అంతే ఆ రోజు వడలు చెయ్యలేదు. ఆలా మొదలయ్యి వాళ్ళ మధ్య ఎన్నో గొడవలు వచ్చేవి. సూర్యకాంతం కి కోడలు తన పద్దతిలో పనులు చెయ్యాలని . సురేఖకి తన ఇష్టానికి ఎందుకు వదలరు అని గొడవ సగంసేపు. కాలం గడిచింది. సురేఖ-రవీంద్రకి ఒక కొడుకు,ఒక కూతురు పుట్టారు. సురేఖ కొడుకు పుట్టాక ఉద్యోగం మానేసి పిల్లల్ని పెంచడంలో బిజీ అయిపొయింది. రవీంద్ర అప్పటికి మంచి పోస్టులోకి వచ్చేసాడు కాబట్టి ఆర్ధిక ఇబ్బందులు ఇప్పుడు లేవు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ప్రయోజకులు అయ్యాక పెళ్లిళ్లు చేశారు. వారు పెళ్లయ్యాక విదేశాలకి వెళ్లిపోయారు.

కొన్ని సంవత్సరాల క్రిందట:

                      కొన్ని ఏళ్ళ  తరువాత పిల్లల్ని చూడడానికి వెళ్లారు. ముందు కొడుకు దగ్గరికి వెళ్లారు. వెళ్లిన రోజు కోడలి చేతి వంట తిన్నారు. ఎంతో రుచిగా ఉన్నాయి. కొడుకు సుఖపడుతున్నాడు అని సంతోషించారు. కొడుకు సొంత ఇంట్లో ఉంటున్నాడు. అది చాలా పెద్దది. రవీంద్ర రిటైర్ అయ్యాక కానీ సొంత ఇల్లు కొనుక్కోలేకపోయారు. కానీ కొడుకు లోను తీసుకొని మరి ఇంత పెద్ద ఇల్లు కొన్నాడు. కొడుకు ధైర్యం చూసి ఆశ్చర్యపోయారు.

                  మరుసటి రోజు ఉదయం బ్రెడ్డు ఇచ్చింది టిఫిన్ కి. వాళ్ళు రోజు అదే  తింటారు అని చెప్పింది. రవీంద్ర సురేఖకేమో రోజు ఇడ్లిలు, దోశలు తినడం అలవాటు. కొంచెం ఇబ్బందిగా అనిపించినా తిన్నారు. కాఫీ నిమిషంలో మైక్రోవేవ్ లో వేడి చేసి ఇచ్చింది. అన్నం రైస్ కుక్కర్ లో పడేసింది. రెండు రెడీమేడ్ కూరలు ఫ్రిడ్జిలోంచి తీసి వేడి చేసింది. రాత్రికి చపాతీలు  కూడా రెడీమేడే . వాళ్ళకేమో ఏ పూటకి  ఆ పూట వేడి వేడిగా వండుకొని తినడం అలవాటు. ఇది  అంతా కొత్తగా ఉంది. రోజు ఇదే తంతు.  ఒక్క శనివారం, ఆదివారం ఫ్రెషగా వండుతుంది కోడలు. కోడలు ఆఫీసుకి  వెళ్ళాలి కాబట్టి మైక్రోవేవ్, డిష్ వాషర్ , కాఫీ మేకర్, ఒవేన్, స్టవ్ ,ఎలా వాడాలో అన్ని చూపించింది. ఈమెకి మిగితా పనులు చేతకావు కాబట్టి అంట్లు తోమడం,ఇల్లు శుభ్రం చెయ్యడం,  బట్టలుతకడం తానే చేసేది. అంతే కాక రోజు పోదున్నే వంటకి కావాల్సిన కూరగాయలన్ని తరిగి పెట్టేది. ఒక రోజు సురేఖ  కోడలితో రోజు బ్రెడ్డు తింటున్నాము కదా రేపు దోశలు చేద్దామని చెప్పింది. కోడలు  సరే అని ఒక అలమారా తెరిచింది. అందులో రకరకాల టిఫిన్లకి ఒక్కొక్క ఇన్స్టంట్ పొడి ఉంది. ఒక ప్యాకెట్ తీసి అందులో నీళ్ళు కలిపి దోశలు పొయ్యడమే అని చెప్పింది. ఇంక సురేఖ ఉండబట్టలేకా అనేసింది " ఇంత  బద్ధకం ఏంటి నీకు. ప్రతి దానికి రెడీమేడ్ వాడుతావు.వంట పని ఎలాగూ నేను చేస్తున్నాను కదా నువ్వు టిఫిన్ పని ఒక్కటి చూడలేవా? ఇలా రోజు రెడీమేడ్వి తింటే మీ ఆరోగ్యాలు ఏమి కావాలి. ఆఫీస్ నుంచి వచ్చాక కొంచెం ఓపిక తెచ్చుకొని చెయ్యలేవు. నేను ఉద్యోగం చేసేటప్పుడు రోజు ఇంటికి వచ్చాక వేడి వేడిగా వండిపెట్టే దాన్ని. మా వాడికి అలాగే అలవాటు " అని. దానితో కోడలికి చిరాకేసింది "ఏంటండీ మీరు. రోజు ఆఫీసులో లక్ష తలనొప్పులతో అలసిపోయి ఇంటికి వచ్చి కాసేపు విశ్రాంతిగా కూర్చోవడానికి లేదు. మళ్ళి ఇంట్లో పనులు చెయ్యాలి. మీ లాగా నాకు పని మనిషి ఏమైనా ఉందా ? ప్రతి పని నేనే చెయ్యాలి. శని వారాలు, ఆదివారాలు ఏ పూటకి ఆ పూత వేడిగా వండిపెడుతున్నా కదా? " అని విసురుగా వెళ్ళిపోయింది.

                         ఆమె వెళ్లి జరిగినదంతా మొగుడికి చెప్పింది. అతను ఆమెను సముదాయించకుండా " ఇప్పుడు ఏమయ్యిందని  నీకు అంత బాధ. ఇంటికి వచ్చిన వాళ్ళు పని చేస్తారని నువ్వు  ఎలా ఆశిస్తావు. అయినా నువ్వు అంత కష్టపడేది  ఏముంది. ఇల్లు క్లీన్ చెయ్యడానికి వాక్యూం క్లీనర్ ఉంది, గిన్నెలు కడగడానికి డిష్ వాషర్ ఉంది, బట్టలు పిండడానికి వాషింగ్ మెషిన్ ఉంది. మళ్ళి నీకు సహాయం ఎందుకు?" అన్నాడు. దానితో ఆమెకు ఇంకా మండింది. "ఇంటికి వచ్చిన వాళ్ళనుంచి ఆశించడం తప్పే కానీ మీ నుంచి ఆశించడంలో తప్పు లేదు కదా. ఆ పనులన్నీ అంత సులువు అయినప్పుడు మీరు ఎందుకు చెయ్యరు. ఏ రోజైన ఒక్క పనిలో సహాయం చేశారా? 24 ఘంటలు పని, టీవీ , కంప్యూటరు తప్ప ఏమి చెయ్యరు. నేను కూడా మీ లాగే 8 ఘంటలు పని చేస్తాను ఆఫీసులో. మరి నాకు కూడా మీ లాగే విశ్రాంతి అవసరం లేదా? లంకంత కొంపని శుభ్రం చెయ్యడం ఎంత కష్టమో మీకు  తెలుసా? డిష్ వాషెర్ లో, వాషింగ్ మెషిన్ లో ఎవరు లోడ్ చేస్తారు? బట్టలు మడతపెట్టి, ఇస్త్రీ చెయ్యాలి. ఇవన్నీ నాకు పెళ్ళికి ముందు అలవాటు లేని పనులు అయినా కూడా నేర్చుకొని రోజు నోరు మూసుకొని చేస్తుంటే నేను ఏమి చెయ్యనట్టు మాట్లాడుతున్నారు" అంది. ఇవన్నీ సురేఖ వినింది. కోడలికి చాలా పొగరు అనుకుంది. మొగుడంటే అస్సలు గౌరవం లేదు అనుకుంది. తన కొడుకుని రాచిరంపాన పెడుతోందనుకుంది. ఎలాగో అక్కడ 3 నెలలు గడిపి కూతురి దగ్గరికి బయలుదేరారు.


                          కూతురి ఇల్లు కూడా చాలా పెద్దది. కోడలి లాగే కూతురు కూడా అన్ని రెడీమేడ్ వంటలే పెట్టింది. రవీంద్ర అన్నాడు సురేఖతో "ఏంటి సురేఖ ఇక్కడ కూడా రెడీమేడ్ గొడవేనా" అని. దానికి ఆమె "పాపమండి అది ఇంట్లో పనులు, ఆఫీస్ పనులతో అలసిపోతుంది. కోడలి దగ్గరే సర్దుకుపోయాము. మనం దాని తల్లి తండ్రులయ్యుండీ అర్ధం చేసుకోకపోతే ఎలా" అని అనింది. ఆమెకి తెలియని విషయం ఏంటి అంటే కూతురికి, కోడలికి మంచి స్నేహం ఉంది. ఆ రోజు జరిగిన గొడవ కోడలు కూతురికి చెప్పింది. సురేఖ కూడా కూతురికి ఫోన్లో చెప్పింది ఆ రోజు.

                            కొన్ని రోజుల తరువాత  కూతురు సురేఖని అడిగింది "ఇక్కడ ఎలా ఉంది" అని. దానికి సురేఖ చాలా సౌకర్యంగా ఉంది అని చెప్పింది. రోజు రెడీమేడ్ వంటలు పెడుతున్నందుకు క్షమించమనింది . దానికి సురేఖ తానూ ఏమి అనుకోలేదని, కూతురికి ఆఫీస్ పనులతో ,ఇంటి పనులతో సరిపోతుంది కదా, తానూ అర్ధం చేసుకోగలను అని చెప్పింది. అప్పుడు కూతురు అనింది "అమ్మా ! వదిన పెట్టినట్టే నేను కూడా రెడీమేడ్ వంటలే పెట్టాను. కానీ నువ్వు నన్ను ఒక్క మాట  అనలేదు. పైగా అర్ధం చేసుకోగలను అన్నావు. మరి వదిన విషయంలో ఎందుకు అర్ధం చేసుకోలేకపోయావు? తనకు బద్ధకం అన్నావు. నాకు నా మొగుడు ఇంటి పనులలో ఎంతో సహాయం చేస్తాడు. అక్కడ అన్నయ్య ఒక్క పనిచెయ్యడు . వాడు ఆలా ఉండడానికి ఒక రకంగా నీ పెంపకమే కారణం. మొగవాడు ఇంటి పనులు చేస్తే లోకువ అయిపోతాడు అని చిన్నపటినుంచి వాడికి బోధించావు. ఇక్కడ చూడడానికి  మెషీన్ల వల్ల అన్ని పనులు చాలా సులువుగా ఉన్నా  మనం కూడా చెయ్యాల్సిన పనులు చాలా ఉంటాయి. నువ్వు చదువుకున్న దానివి కొంచెం కష్టపడితే నీకు అన్ని పనులు అర్ధం అయ్యేవి.  కానీ నువ్వు ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకంటే కోడలు ఉండగా నేను ఎందుకు పనులు చెయ్యాలి అనే భావన. కూతురు కష్టపడుతుంటే చూడలేవు  కానీ కోడలికేమో పొగురున్నావు. ఇది ఎక్కడి న్యాయం అమ్మా. కోడలు, కూతురు ఎప్పుడూ సమానం కాదు కాదమ్మా?"  సురేఖకు తన తప్పు తెలిసివచ్చింది. తన ప్రవర్తనకి సిగ్గు పడింది. చాలా ఏళ్ళ క్రిందట తన అత్తగారితో తనకు జరిగిన గొడవ గుర్తొచ్చింది. కోడలు నిజానికి చాలా మంచి పిల్ల. ఆ రోజు ఎదో చిరాకుతో ఆలా అన్నా  తరువాత తనను ఎంతో బాగా చూసుకుంది. తానే అన్ని మనుసులో పెట్టుకొని ముభావంగా ఉన్నింది అక్కడ ఉన్నన్ని రోజులు. ఇక నుంచి ఊరికే చెప్పడం కాదు నిజంగానే కోడల్ని కూతురితో సమానంగా చూసుకోవాలి అనుకుంది.


Author's note: ప్రతి తరంలోను ఎన్నో మార్పులు ఉంటాయి. ఇక్కడ వంటిల్లు, వంటింటి పరికరాలు ఉదాహరణగా చేసుకొని చెప్పాను. . కానీ ఇలాంటివి ఎన్నో. అటు తరం వారు ఇటు తరం వారు అర్ధం చేసుకొని సర్దుకు పోతే ఏ కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండవు .
            

No comments:

Post a Comment

To leave a comment please touch the rectangle next to "comment as" and you can pick options like if you want to use your google id or wordpress login etc. to comment. You also have the option to just use your name and be anonymous to leave a comment.